నేపాల్ ప్రధాని రాజీనామా చేశారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో కేపి రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.

ఓలి రాజీనామా చేయడంతో సైనిక పాలన విధిస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో నిషేధం విధించడంపై నేపాల్ లో సోమవారం యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేపాలి యువత ఖాట్మండులో నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కొంతమంది నిరసన కారులు పార్లమెంట్ ఆవరణలోకి వెళ్లడంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా… 300 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆందోళనలో పలువురు వ్యక్తులు మరణించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది.