సికింద్రాబాద్‌లోని కమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో ఓ వర్గానికి చెందిన సలీం అనే వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటు హిందూ సంఘాలు, మాజీ మంత్రులు, ప్రతిపక్షాలు సైతం సీరియస్ అయ్యాయి. దీనిని నిరసిస్తూ ఇటీవల హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునివ్వగా.. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయగా కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో త్వరలోనే కొత్త విగ్రహం ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని సందర్శించిన ఆయన..3 రోజుల పాటు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కుంభాభిషేకం కూడా చేస్తామన్నారు.పూజారులు, పండితుల సూచన మేరకు ఈ ఆలయంలో శాంతి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆలయంపై దాడి నేపథ్యంలో శాంతి స్థాపన, సంప్రోక్షణ కార్యక్రమాలు ఎలా జరపాలనేదానిపై పండితులు, ఆలయ సిబ్బందితో తలసాని చర్చలు జరిపారు.