ఏపీలో అధికార వైసీపీ దెబ్బకు విపక్ష టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఫ్యాన్ కింద సేద తీరేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జగన్ పార్టీ గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. జనసేన రాజోలుతో సరిపెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం 23 సీట్లు సాధించింది. ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దూరం జరిగి జగన్‌కు దగ్గరయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. టీడీపీ నుంచి గన్నవరంలో వరుసగా రెండోసారి గెలిచిన వంశీకి స్థానికంగా మంచి పట్టు ఉంది. అందుకే భయంకరమైన జగన్ వేవ్ తట్టుకుని మరీ ఆయన గన్నవరంలో రెండోసారి గెలిచారు.
వంశీ పార్టీని వీడడంతో గన్నవరం టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలో కూడా తెలియని డైలమాలో చంద్రబాబు నిన్నటి వరకు ఉన్నారు. ముందుగా పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్ పేరు ఇక్కడ గట్టిగా వినపడింది. ఆ తర్వాత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే అనూరాధ పేరు వినిపించింది. అయితే వీరెవ్వరు కూడా గన్నవరంలో పార్టీ పగ్గాలు తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చివరకు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జనుడికి బాధ్యతలు ఇస్తున్నట్టు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం ఈ మేరకు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రకటన చేశారు. అంటే వంశీపై బీసీ అస్త్రం ప్రయోగించి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు.