పేదలకు ఇళ్లు పంచాలని అనుకున్నారు. తెలుగు మీడియం స్థానంలో ఆంగ్లాన్ని తీసుకువచ్చి సంచలనం సృష్టించాలని భావించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని అనుకున్నారు. శాసన మండలిని రద్దు చేయాలని అనుకున్నారు. దిశ చట్టం తీసుకువచ్చి.. మహిళలకు అండగా ఉండాలని అనుకున్నారు. పోలవరాన్ని పరుగులు పెట్టించాలని భావించారు. ఇక, జిల్లాల ఏర్పాటు ద్వారా ఏపీ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఇవన్నీ.. ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
న్యాయ పోరాటాలు జరుగుతున్నవి కొన్నయితే.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నవి మరికొన్ని.. ఇక, కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉన్నా.. ఆమోదానికి నోచుకోనివి ఇంకొన్ని.. ఇలా అనేక పథకాలు, కార్యక్రమాలు, ప్రణాళికలు.. జగన్ వ్యూహాన్ని ఎక్కడికక్కడే నిలువరించారు. ఇప్పుడు ఏం చేయాలి. మరో మూడేళ్ల కాలం మాత్రమే ఉంది. మరోపక్క, ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా లేక పోగా.. ప్రజల తలసరి ఆదాయం పెరగడం లేదు. ప్రభుత్వానికి ఆదాయమూ రావడం లేదు. ఈ పరిణామాలతో ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ప‌్రజలను ఎలా మెప్పించాలి? ఇప్పుడు వైసీపీ సర్కారును వేధిస్తున్న అత్యంత కీలకమైన ప్రశ్నలు ఇవే!
తనకు దఖలు పడిన అధికారాన్ని ముప్పై ఏళ్లపాటు సుస్థిరం చేసుకోవాలని అనుకున్న సీఎం జగన్‌కు ఏదో ఒక రూపంలో అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం అంత తేలిక కాదని అర్థమైపోయింది. ఇప్పుడు ముందున్న కర్తవ్యం.. మరోసారి ప్రజల్లోకి వెళ్లడం.. ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ప్రజలకు వివరణ ఇవ్వడం.. ఉన్నతలో ఉన్నతంగా నియోజకవర్గ అభివృద్దికి నిధులు అందించడం.. ఇంతకు మించి ఇప్పుడు జగన్‌కు కనిపిస్తున్న మార్గం మరొకటి లేదని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరి దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారు. ఎంపీ పదవులు అన్నీ తనకే ఇస్తే..కేంద్రాన్ని దారిలో పెడతానన్న ఆయన కేంద్రం దారిలో తాను నడుస్తున్నా ప్రయోజనం లేక పోవడంతో ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు సీఎం జగన్ అంతరంగ తరంగాల్లో మెలిపెడుతున్న ఆలోచనలు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
-Vuyyuru Subhash