ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యుడు తన బైక్‌ను బయటకు తీయాలంటే వందసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. బైక్ వద్దు.. బస్సుకు పోతే బెటర్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు పుంజుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో విద్యుత్‌తో నడిచే వాహనాల వైపు చూస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయి.
తాజాగా తమిళనాడు కంపెనీ శ్రీవారు మోటర్స్ లాంచ్ చేసిన ‘ప్రాణా’ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. యువతను ఆకట్టుకునే విధంగా స్టైలిష్ లుక్‌తో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. బ్యాటరీ సాయంతో నడిచే ఈ బైక్ ఒక్కసారి చార్జ్ చేస్తే 225 కి.మీ వరకు వెళ్లొచ్చంట. చార్జ్ చేయటానికి 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. 4 సెకండ్లలో గరిష్టంగా 60కి.మీ వేగంతో వెళ్తుందట. గరిష్టంగా ఈ బైక్ గంటకు 123కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. ప్రాణా బైక్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ బైక్‌లో 72 వోల్డ్ 7.2 కిలో వాట్స్ లిథియమ్ అయాన్ బ్యాటరీలను వినియోగించారు. ఒక్క బ్యాటరీని 2 వేల సార్లు చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మూడు కలర్లతో ఇది అందుబాటులో ఉంది. మిస్టరీ బ్లాక్, ప్రొగ్రెస్సివ్ గ్రీన్, ప్యాషనేట్ రెడ్, పర్‌ఫెక్ట్ వైట్ కలర్లతో ఇది మార్కెట్‌లోకి వచ్చింది.
మూడు వేరియంట్లలో ఈ బైక్‌ను రూపొందించారు. క్లాస్, గ్రాండ్, ఎలైట్ మోడల్స్ ఉన్నాయి. గ్రాండ్ వేరియెంట్ ధర రూ.1,99,999. ఎలైట్ బైక్ ధర రూ.2,74,999. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. క్లాస్ మోడల్ ధరను ఇంకా ప్రకటించలేదు. విద్యుత్‌తో నడిచే బైక్‌తో పెట్రోల్ నుంచి ఊరట లభించటమే కాదు.. పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు అంటున్నారు శ్రీవారు మోటార్స్. 10 మొక్కలు నాటితే రూ.25 వేల డిస్కౌంట్ ఇస్తారట.. అయితే వేర్వేరు ప్రాంతాల్లో నాటాలండోయ్.. బైక్ బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసిన 45రోజుల్లో బైక్ డోర్ డెలివరీ అవుతుంది. ఎలైట్ బైక్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. దేశంలోని టాప్ సిటీస్‌లో కంపెనీ డీలర్లను పెట్టుకుంది. రేట్ ఎక్కువైనా రేంజ్ బాగుండటంతో యువత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.