దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలను ఇస్తోంది. చాలా మంది ఈ చట్టం గురించి విమర్శించినా ఢిల్లీలో మాత్రం ఈ చట్టం బాగా ఉపయోగపడుతుందని వెల్లడైంది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలను ఇస్తోంది. చాలా మంది ఈ చట్టం గురించి విమర్శించినా ఢిల్లీలో మాత్రం ఈ చట్టం బాగా ఉపయోగపడుతుందని వెల్లడైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో జారీ అయిన ట్రాఫిక్ చలాన్లతో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జారీ అయిన ట్రాఫిక్ చలాన్ల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం.
2018 సెప్టెంబర్‌లో ఢిల్లీలో మొత్తం 5,24,819 చలాన్లు జారీ కాగా, ఈ సారి సెప్టెంబర్ నెలలో 1,73,921 చలాన్లు మాత్రమే జారీ చేశారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి శాతం 66 వరకు తగ్గిందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్ నెలలో ఓవర్ స్పీడింగ్‌కు గాను 13,281 చలాన్లు జారీ కాగా ఈ సారి మాత్రం కేవలం 3,366 చలాన్లు మాత్రమే జారీ అయ్యాయి. అలాగే ట్రిపుల్ రైడింగ్ చలాన్లు 15,261 నుంచి 1853కు తగ్గాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారి చలాన్లు 1,04,522 నుంచి 21,154కు తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చలాన్లు 3682 నమోదు కాగా, ఈ సారి 1475 మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నూతన మోటారు వాహన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలను ఇస్తుందని అక్కడి ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
అయితే ఢిల్లీలో ఇంతలా మార్పు రావడానికి కారణం.. నూతన మోటారు వాహన చట్టం ప్రకారం విధించబడుతున్న భారీ చలాన్లే అని తెలుస్తోంది. దాంతోపాటు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి అక్కడి వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడం లేదట. ఈ క్రమంలోనే నూతన మోటారు వాహన చట్టం అనుకున్న ఫలితాలను ఇస్తుండడంతో అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టం ఫలితాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!