దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని..అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని’ మంగళవారం ఉదయం కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. ‘కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ.కేసీఆర్ సూచనలతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని కోట్లు ఖర్చయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది కేసీఆర్ కుట్ర’ అని కౌంటర్ ఇచ్చారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టబోమని మూడేళ్లు సంపూర్ణంగా పాలించే అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.