విజ‌య‌వాడ to హైద‌రాబాద్‌కు మ‌రో రూటు.. జ‌గ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తోంది..!

-

ఏపీ సీఎంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లిస్తోంది. హైద‌రాబాద్‌కు విజ‌య‌వాడ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌ర‌హ‌దారి స్థానంలో మ‌రొక‌టి ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి ఖమ్మంను కలిపే ఆరులేన్ల కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. దీనికి తెర‌వెనుక జ‌గ‌న్ కృషి ఉంద‌ని కేంద్ర‌మే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇది పూర్తయితే హైదరాబాద్ హైవే కంటే మెరుగ్గా ఇరు నగరాల మధ్య దూరం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనున్నాయి.

విజయవాడ-ఖమ్మం నగరాల మధ్య ప్రయాణదూరాన్ని, సమయాన్ని తగ్గిస్తూ కొత్తగా ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇరు రాష్ట్రాలకు ప్రతిపాదనలు చేసింది. దీనికి అవసరమైన భూసేకరణ, వ్యయంతో పాటు అన్ని ఇతర అంశాలపై ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పీపీపీ విధానంలో ఈ రహదారిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి విజయవాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు పలు రహదారులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది హైదరాబాద్ హైవే మీదుగా కోదాడ వరకూ వెళ్లి అక్కడి నుంచి రాష్ట్ర రహదారి మీదుగా ఖమ్మంకు వెళ్లేలా ఉంది.

దింతో పాటు విజయవాడ నుంచి చిల్లకల్లు వరకూ వెళ్లి అక్కడి నుంచి వత్సవాయి మీదుగా కూడా ఖమ్మం చేరుకోవచ్చు. కానీ 2018లో విజయవాడ-హైదరాబాద్ రైలు మార్గానికి సమాంతరంగా ఓ కొత్త రహదారి వేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని ఇప్పుడు అమల్లోకి తెస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ- హైదరాబాద్ హైవే నాలుగు వరుసలుగా ఉంది. దీనిపై ట్రాఫిక్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగితే క్లియర్ చేయడానికి కూడా చాలా సమయం పడుతోంది. వీటితో పాటు సాంకేతికంగా కూడా మరికొన్ని ఇబ్బందులున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి నేరుగా ఖమ్మంకు అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలుగా దీన్ని రూపకల్పన చేయబోతున్నారు.

కొత్తగా విజయవాడ నుంచి రైల్వే మార్గానికి సమాంతరంగా ఖమ్మంకు ఆరు వరుసల రహదారి నిర్మించడం వల్ల దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ హైవే మీదుగా విజయవాడ నుంచి ఖమ్మం వెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం ఉంది. రైలు మార్గంలో అయితే 101 కిలోమీటర్లు ఉంది. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మిస్తే 80 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అంచనా. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రతిపపాదనను పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లించి.. తెలంగాణ‌కు ఏపీకి మ‌ధ్య దూరం మ‌రింత త‌గ్గుతుంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version