కేవలం ఒకే ఒక్క ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌ను చూపిస్తు.. కేవలం రెండు వారాల్లోనే పూర్తి కావాల్సిన ఎన్నికల ప్రక్రియను ఆయన వాయిదా వేశారు. అయితే, దీనిపై అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆశ్చర్యంతోపాటు, మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో అతిగా స్పందించారని అనే వారు కూడాక నిపిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్దగా కరోనా ఎఫెక్ట్ లేదని, కానీ, ఇంతలోనే ఇలా వ్యవహరిస్తూ.. వాయిదా వేసేయడం బాధాకరమని వైసీపీ నాయకులు అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీలో నేతల్లో తీవ్ర అలజడి నెలకొంది.
ఒక వైపు ఎన్నిక ల కోడ్ అమల్లోనే ఉండడం, మరోపక్క ఎన్నికలను వాయిదా వేయడంపై వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతు న్నారు. ఇప్పటి వరకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కార్యకర్తలను సమీకరించుకుని ప్రచారం కూడా ప్రారంభించామని, (వాస్తవానికి ఇది అన్ని పార్టీలూ చేసేదే) కానీ, ఇప్పుడు ఉన్నపళంగా ఇలా మార్చడం సబబు కాదని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు దాదాపు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించే ప్రక్రియలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే వాదన దిశగా వైసీపీ నేతలు వాణిని వినిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ నేతల్లో ఒక విధమైన అలజడి నెలకొందనేది వాస్తవం.
ఇదిలావుంటే, ఎన్నికలు వాయిదా పడడంపై వైసీపీలోని మరో వర్గం నాయకులు మంచిదనే ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునేందుకు మరింతగడువు వచ్చినట్టయిందని అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజులు నుంచి ఆరు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రజలను చేరుకోలేక పోయామని, ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించలేక పోయామని, పైగా కార్యకర్తలను కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోలేక పోయామని వారు అంటున్నారు.
అయితే మరో వర్గం వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే చాలా ఏకగ్రీవాలు చేసుకున్నామని.. ఇదే జోష్‌తో ఎన్నికలకు వెళితే పూర్తిగా స్వీప్ చేసేవాళ్లమని… ఇప్పుడు ఈ జోరుకు ఎన్నికల వాయిదా నిర్ణయం ఒక్కసారిగా బ్రేక్ వేసినట్లు అయ్యిందని నిట్టూరుస్తున్నారు. అయితే జగన్ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే వాళ్ల పదవులు పీకేస్తానని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరో రెండు నెలల పాటు నేతలకు టెన్షన్ తప్పేలా లేదు. ఇక ఎన్నికలు వాయిదా మంచిదైంటోన్న వారు మాత్రం తమకు తగినంత సమయం వచ్చినట్టయిందని అంటున్నారు. ఇలా వైసీపీలో నేతలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా స్థానికంగా గెలుపుపై పట్టు సాధించాలనే ప్రక్రియను మాత్రం మరింత తీవ్రం చేయాలని చూస్తున్నారు.