మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 లోని 28 నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నాలుగేళ్ల పిల్లలు సైతం హెల్మెట్ తప్పని సరిగా ధరించాల్సి ఉంది. ఈ కొత్త సవరణల నేపథ్యంలో భారీ జరిమానాలు తప్పవు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం విషయాలను బుధవారం వెల్లడించడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇక మిగిలిన వాళ్లకు సంబంధించి నిబంధనలు రూపొందించి వాటిపై అభిప్రాయసేకరణ తర్వాత అమలు చేయనున్నారు. దేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేలా… ప్రజల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ద్విచక్రవాహనంపై వెళ్తూ నాలుగేళ్ల లోపు పిల్లలకు కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 500 నుంచి 10 వేల వరకు జరిమానాతో పాటు… ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇక అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై 20 వేల జరిమానాతో పాటు ప్రతి రెండు వేల చొప్పున అదనపు జరిమానా వేస్తున్నట్లు ప్రకటించింది. మరో ట్విస్ట్ ఏంటంటే ఆ అదనపు లోడును దించే వరకు ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదలనివ్వరు. అలాగే ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకుంటే ప్రతి అదనపు ప్రయాణికుడిపై రూ. 200 చొప్పున జరిమానా విధిస్తారు.
సీటు బెల్ట్ పెట్టుకోని డ్రైవర్లకు జరిమానా విధిస్తారు. టిక్కెట్ లేని ప్రయాణికులకు ఇప్పటివరకు వేస్తున్న 200 రూపాయల జరిమానాను ఇకపై 500 కు పెంచాలని…. అనుమతి లేకుండా వాహనం నడిపితే ప్రస్తుతం విధిస్తున్న వెయ్యి రూపాయల స్థానంలో అయిదు వేలు వసూలు చేస్తారు. లైసెన్సు లేకుండా బండి నడిపితే 500 నుంచి 5 వేలకు పెంచారు. అర్హతలేని వాహనం నడిపితే జరిమానా 500 నుంచి 10 వేల వరకు పెంచారు. మద్యం తాగి వాహనం నడిపితే ప్రస్తుతం వేస్తోన్న రూ.2 వేల జరిమానాను రూ.10 వేలకు పెంచారు. సీటు బెల్టు పెట్టుకోకపోతే రూ.100 జరిమానా రూ. వెయ్యికి పెంచారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా రూ.2 వేలకు పెంచారు.