భార్యాభర్తలు అంటే.. వారి శరీరాలు వేరే కానీ మనస్సు మాత్రం ఒక్కటే అన్నట్లుగా ఉండాలి. ఇద్దరూ ఒకే హృదయంతో ఆలోచించాలి. ఒకరి కష్టాన్ని, సుఖాన్ని మరొకరు పంచుకోవాలి. అన్ని సమయాల్లోనూ ఒకరికొకరు తోడు, నీడగా నిలవాలి. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కాబట్టే.. అతను తన భార్య కోసం ఎవరూ చేయని పని చేస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసా..?
అది చైనా. అతని పేరు వాంగ్ షయోమిన్. అతని వయస్సు 57 సంవత్సరాలు. అతని భార్య గత 5 సంవత్సరాల కిందట మోటార్ న్యూరాన్ డిసీజ్ బారిన పడింది. దీంతో ఆమె ఎక్కడికీ నడవలేదు. ఇక ఈ దంపతులకు పిల్లలు కూడా లేరు. అయితే వాంగ్ మాత్రం తన భార్యను విడిచిపెట్టలేదు. ఆమెకు ప్రపంచాన్ని చూపించాలనుకున్నాడు. అందులో భాగంగానే చైనాలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలకు ఆమెను తనతోబాటుగా తీసుకెళ్లడం ప్రారంభించాడు.
అయితే మరి ఆమె నడవలేదు కదా.. అంటే.. అవును, నడవలేదు. కానీ వాంగ్ ఉన్నాడు కదా. తన వెనుక చంటి పిల్లలను కట్టుకున్నట్లు తన భార్యను కట్టుకున్నాడు. అలా కట్టుకుని తనతోపాటు ఆమెను తీసుకెళ్లడం ప్రారంభించాడు. అలా వాంగ్ తన భార్యను పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తూ ప్రపంచాన్ని చూపుతున్నాడు. అందులో భాగంగానే వారు పొటాలా ప్యాలెస్, లాసా, టిబెటన్ ప్లేటూలో ఉన్న హోక్సిల్ తదితర ప్రదేశాలకు వెళ్లారు. ఇక తాజాగా వారు చైనాలో ఉన్న అత్యంత ప్రముఖ పర్వతమైన హువాంగ్ షాన్‌కు వెళ్లారు. ఈ పర్వతం చైనాలోని 10 ప్రముఖ పర్వతాల్లో ఒకటి. దాన్ని ఎక్కి దిగుతుండగా తీసిన ఫొటోయే అది. అది బయటకు రావడంతో వాంగ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఏది ఏమైనా భార్య కోసం వాంగ్ పడుతున్న తాపత్రయం అభినందనీయం కదా..!