తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. మార్చి 26,2021 రాత్రి గుడి మూసిన తర్వాత లోపలే ఉండిపోయిన దొంగ హుండీలో చోరీకి యత్నించాడు. రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, ప్రయత్నాలు ఏవీ సఫలం కాలేదు. మార్చి 27,2021 ఉదయం గుడి తలుపులు తెరిచాక భక్తులతో కలిసిపోయి బయటకు వెళ్ళిపోయాడు.
రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఉదయాన సుప్రభాత సేవ కోసం అర్చకుడు ఆలయాన్ని తెరిచాడు. ఆలయంలో హుండీతో పాటు చిందరవందరగా సామాగ్రి పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందనే అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చివరికి మైనర్ అయిన ఆ దొంగను పట్టుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఆ మైనర్ బాలుడు, ఇంట్లో గొడవ పడి తిరుపతి వచ్చినట్లు గుర్తించారు.