కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తీసుకున్న పలు కీలక నిర్ణయాల కారణంగా వచ్చేనెల దేశవ్యాప్తంగా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. దీంతో వాహనదారులకు కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లు జారీ చేస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే సాధారణ పౌరులకు ఎన్ని సమస్యలు ఎదురవుతుంటాయో అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్డులలో దొర్లే తప్పులకు ఇకపై చెక్ పడనుంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్ కి పంపించే ముందు వాటి కాపీలను దరఖాస్తుదారులకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా డిజిటల్ రూపంలో పంపుతారు. దీంతో ఆ కార్డులను దరఖాస్తు దారులు ఒకసారి చూసుకుని అన్నీ కరెక్టుగా ఉన్నాయని చెబితే.. ఆ తరువాత రవాణాశాఖ ఆ కార్డులను ప్రింట్ చేసి దరఖాస్తుదారులకు అందిస్తుంది. దీంతో ఆయా కార్డుల్లో దొర్లే తప్పులను నివారించవచ్చు.
కాగా కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనున్న ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ముందుగా పలు ప్రాంతాల్లో అమలు చేసి దాని పనితీరును పరిశీలిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ జాయింట్ కమిషనర్, ఆన్లైన్ సర్వీసెస్ సిటిజెన్స్ కమిటీ చైర్మన్ రమేష్ వివరాలను తెలిపారు. ట్రాన్స్పోర్ట్ భవన్ లో తాజాగా రమేష్ అధ్యక్షతన సమావేశమైన సదరు కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని అన్నారు. రవాణా శాఖ అందించే సేవల్లో టెక్నాలజీని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇక పెండింగ్‌లో ఉన్న కార్డులను రేపటి నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు.
కాగా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తీసుకున్న పలు కీలక నిర్ణయాల కారణంగా వచ్చేనెల దేశవ్యాప్తంగా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. దీంతో వాహనదారులకు కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లు జారీ చేస్తారు. ఈ కార్డులపై మైక్రోచిప్, క్యూ ఆర్ కోడ్లు ఉంటాయి. దీంతోపాటు కార్డు వివరాలు వేగంగా గుర్తించేందుకు ఎన్ఎఫ్సీ ఫీచర్ ను కూడా ఈ కార్డుల్లో అందజేయనున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే సెక్యూరిటీ ఫీచర్లతో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో వాటిని జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లపై డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవ దానం చేస్తామని ఇచ్చే డిక్లరేషన్ వివరాలు కూడా ఉంటాయి. ఇక దివ్యాంగులకు అయితే వారికి సంబంధించిన వివరాలను కూడా కార్డుపై పొందుపరుస్తారు.
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 32వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు అవుతుండగా నెలకు 9.60 లక్షల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను జారీ చేస్తున్నారు. వాటిలో రెన్యువల్ కార్డులు కూడా ఉంటున్నాయి. ఇక నిత్యం 43 వేల వాహనాలు (నెలకు సుమారుగా 13 లక్షల వాహనాలు) కొత్తగా రిజిస్టర్, డీ రిజిస్టర్ అవుతున్నాయి. ఈ వాహనాలకు, వాహనదారులకు కొత్తగా ప్రవేశ పెట్టే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను రవాణా శాఖ జారీ చేయనుంది. కాగా ఈ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఆయా కార్డులను జారీ చేసినందుకు రవాణా శాఖ వాహనదారుల నుంచి రూ.15, రూ.20 రుసుం వసూలు చేయనున్నట్లు తెలిసింది..!