బంతి బ్యాట్ కు తగిలిందా, బ్యాట్స్‌మన్‌కు తగిలిందా అన్న నిర్ణయాలను తీసుకోవడంలో అంపైర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర సమస్యలను కూడా అధిగమించేందుకు త్వరలో స్మార్ట్ బంతిని క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
క్రికెట్‌లో టెక్నాలజీ వినియోగంలోకి వచ్చాక అంపైర్ల పని మరింత తేలికైంది. ముఖ్యంగా ఆటగాళ్లు ఔట్ అయ్యారా, లేదా అన్న నిర్ణయాలను తీసుకునేందుకు ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అలాగే క్రికెట్ మ్యాచులను హెచ్‌డీ క్వాలిటీలో వీక్షించేందుకు కూడా వీలు కలుగుతోంది. ఇప్పటికే క్రికెట్‌లో టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చినా.. పలు విషయాల్లో మాత్రం టెక్నాలజీ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండుననే అనిపిస్తోంది. అయితే అందుకు తగిన విధంగానే ఎప్పటికప్పుడు నూతన మార్పులు కూడా చేసుకుంటున్నాయి.
ఏ క్రికెట్ మ్యాచ్ లో అయినా సరే.. అంపైర్లు పలు సార్లు ఎల్బీ డబ్ల్యూలను ఇవ్వడంలో విఫలం చెందుతూనే ఉన్నారు. దీంతోపాటు బంతి బ్యాట్ కు తగిలిందా, బ్యాట్స్‌మన్‌కు తగిలిందా అన్న నిర్ణయాలను తీసుకోవడంలో అంపైర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇవే కాకుండా పలు ఇతర సమస్యలను కూడా అధిగమించేందుకు గాను త్వరలో స్మార్ట్ బంతిని క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఏంటా బంతి..? దాని కథేంటి..? అనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే…
ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్రా అనే సంస్థ అత్యంత నాణ్యత కలిగిన క్రికెట్ బంతులను తయారు చేసి విక్రయిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ కంపెనీ తయారు చేసే బంతులనే క్రికెట్‌లో వాడుతారు. అయితే ఇకపై కూకాబుర్రా బంతులు మరింత స్మార్ట్ కానున్నాయి. అందుకుగాను వాటిల్లో ఆ కంపెనీ మైక్రో చిప్‌లను అమర్చుతోంది. ఇలా మైక్రో చిప్‌లను అమర్చడం వల్ల బంతి వేగం ఎంత ఉంది, దాని నియంత్రణ, కోణం, దాన్ని బౌలర్ ఏ పాయింట్‌లో రిలీజ్ చేశాడు, బంతి పిచ్ అయ్యే ముందు బౌన్స్ ఎంత ఉంది, పిచ్ అయ్యాక బౌన్స్ ఎలా ఉంది.. వంటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. ఇక స్పిన్ బౌలర్లు అయితే బంతి ఎన్ని డిగ్రీల్లో టర్న్ అవుతుంది, గాలిని బట్టి ఎంత వేగంతో బంతిని విసరాలి, ఎక్కడ బాల్ వేస్తే బంతి ఎలా టర్న్ అవుతుంది.. వంటి వివరాలను ఈ స్మార్ట్ బంతుల ద్వారా తెలుసుకోవచ్చు.
కాగా ఈ స్మార్ట్ బంతి సహా్యంతో అంపైర్లు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలను మరింత కచ్చితత్వంతో తీసుకునేందుకు వీలు కలుగుతుంది. బంతి ఏ దిశలో వెళ్తుందో, బ్యాట్స్‌మెన్‌కు తాకిందా, బ్యాట్‌కు తాకిందా, వికెట్లను బంతి పడగొడుతుందా.. వంటి వివరాలు చాలా కచ్చితత్వంతో తెలుస్తాయి. దీంతో అంపైర్లు సులభంగా ఔట్ నిర్ణయాలను ప్రకటించవచ్చు. అయితే ఈ స్మార్ట్‌బంతిని మొదటగా ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్ బాష్ లీగ్‌లో పరీక్షించనున్నట్లు తెలిసింది. భారత్‌లో జరిగే ఐపీఎల్ తరువాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. దీంతో అక్కడ ముందుగా ఈ బంతిని పరీక్షిస్తారు. ఆ తరువాత ఇతర లీగ్‌లలోనూ దీన్ని పరిశీలిస్తారు. దీని వల్ల బాగా ఉపయోగం ఉందనుకుంటే ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఈ స్మార్ట్ బంతులను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.