క‌ర్నాట‌క బై ఎల‌క్ష‌న్ కౌంటింగ్ పూర్తి… ఎవ‌రికెన్ని సీట్లంటే…

-

దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కర్ణాటక లోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బిజెపి దూసుకుపోయింది. క‌మ‌లం దెబ్బ‌కు కాంగ్రెస్‌, జేడీఎస్ క‌కావిక‌ల‌మ‌య్యాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.

ఈ 12 సీట్ల‌లో గెలుపు కూడా క‌లుపుకుంటే అసెంబ్లీలో బీజేపీ బ‌లం మొత్తం 117కు చేరుకుంది. ఇక కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇక గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. జేడీఎస్‌, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.

అయితే ఈ కూటమిలో కలహాలు రావడంతో ఏడాదికే ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ క్ర‌మంలోనే మొత్తం 15 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఇక ఈ విజ‌యంత క‌ర్ణాట‌క‌లో బీజేపీ స‌ర్కార్‌కు వ‌చ్చిన ముప్పేమి లేకుండా పోయింది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ విజ‌యంపై స్పందించారు. ఉప ఎన్నిక‌ల తీర్పుతో బీజేపీ స‌త్తా ఏంటో చాటి చెప్పార‌ని తెలిపారు. ఇక బీజేపీ 12 స్థానాల్లో గెలవడం తమ పార్టీకి గొప్ప విజయమని కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు. వ‌చ్చే మూడున్న‌రేళ్లు క‌ర్ణాట‌క‌లో సుస్థిర ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version