ప‌వ‌న్‌కు కేసీఆర్ ఆ ఛాన్స్ ఇస్తాడా..!

-

అస‌లే కేసీఆర్‌.. ఆపై ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో గుర్రుగా ఉన్నారు. ఒక్క ర‌వాణాశాఖా మంత్రి పువ్వాడ అజ‌య్‌, కొంద‌రు అధికారుల‌తో త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ అపాయింట్ ఇవ్వ‌లేదు కేసీఆర్‌. అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తున్నా.. ఒక్క‌మెట్టు కూడా దిగ‌లేదు ఆయ‌న‌. చాలా క‌ఠినంగా ఉంటున్నారు. చివ‌రికి హైకోర్టు కొంత‌మేర‌కు సీరియ‌స్ అవుతున్నా.. పెద్ద‌గా ఖాత‌రు చేయ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబితే కేసీఆర్ వింటారా..? అస‌లు ముందుగా ప‌వ‌న్‌కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారా..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

గురువారం నాడు ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో జేఏసీ నేత‌లు క‌ల‌వ‌డంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతానని ఆయ‌న‌ తెలిపారు. తనకున్న మార్గాల ద్వారా కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తానని, కార్మికుల సమస్యలను ఆయనకు వివరిస్తానని చెప్పారు. నవంబరు 3వ తేదీలోపే కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తానన్నారు. అలాగే, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌తోనూ మాట్లాడుతానని ప‌వ‌న్ చెప్పారు.

కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారా? అన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ… ‘‘చర్చలు విఫలమవుతాయని ముందే అనుకోవడం ఎందుకు? అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి. ప్రయత్నం చేసి విఫలమయ్యాక అప్పుడు మాట్లాడుదాం. చర్చల ద్వారా సానుకూల స్పందన వస్తుందనే అనుకుంటున్నా. అందరితోనూ మాట్లాడుతాను. మిలియన్‌ మార్చ్‌ లాంటి కార్యక్రమాల దాకా ఎందుకు? సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా’’ అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ఇక్క‌డ‌ మ‌రో విష‌యం ఏమిటంటే.. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోసం నవంబరు 3వ తేదీన విశాఖలో లాంగ్‌మార్చ్‌ చేపట్టనున్నారు. అయితే.. తెలంగాణ‌లో మాత్రం మిలియ‌న్ మార్చ్ లాంటి కార్య‌క్ర‌మాలు ఎందుకు..?  సామ‌ర‌స్య‌పూర్వంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ప‌వ‌న్ చూసించారు. మ‌రి ఏపీలో మిలియ‌న్ మార్చ్ చేప‌ట్ట‌కుండా.. సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవడానికి ప‌వ‌న్ ఎందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి.

కేసీఆర్ గురించి ప‌వ‌న్‌కు పూర్తిగా తెలుసున‌ని, కేసీఆర్ నోరు తెరిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో..ప‌వ‌న్‌కు పూర్తిగా అవ‌గాహ‌న ఉంద‌ని, అందుకే ప‌వ‌న్ ఇలా మెల్లిగా మాట్లాడుతున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రెండోచోట్లా ఓడిపోయిన త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాట‌ల‌కు ఎవ‌రూ పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version