చింతచచ్చినా పులుపు చావని విధంగా ఉంది టీడీపీ పరిస్థితి. గత ఏడాది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కూడా ఆపార్టీలో ఇంకా మార్పు కనిపించడం లేదు. ఎక్కడ ఏ పొరపాటు కారణంగా తాము ఘోర పరాజయం పొందామో సమీక్ష చేసుకోని పుణ్యమా అని టీడీపీ ఇప్పటికీ తనే అధికారంలో ఉన్నట్టుగా ఫీలవుతుండడం రాజకీయాల్లో ఇలా కూడా జరుగుతుందా? అనే ఆలోచనను తెరమీదికి తెస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వంపై వితండ వాదనను టీడీపీ నేతలు అందుకున్నారు. రాష్ట్రంలో పేదల కు ఇళ్లు పంచాలని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది ఉగాది నాటికి ఎట్టి పరిస్థితిలోనూ 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసుకున్న ముందస్తు ప్రణాళిక, వ్యూహంలో భాగంగానే జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది.దీనికి గాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలను గుర్తించింది.
అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కూడా గుర్తించి పంపిణీకి సిద్ధం చేసింది. అయితే, ఇంతలోనే స్థానిక ఎన్నికలు వచ్చాయి. దీంతో కోడ్ కారణంగా వాటి పంపిణీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడ్డుతగిలింది. అయితే, ఇంతలోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. అదేసయమంలో ఎన్నికల కోడ్‌ను కూడా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల పంపిణీని మరోసారి తెరమీదికి తెచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడాఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఇంతలోనే మరో అడ్డంకి వచ్చింది. అదే కరోనా. ఇళ్ల పంపిణీ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా జనసందోహం రోడ్ల మీదకు వచ్చే పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది. నిజానికి ప్రభుత్వం కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు దానిని పండుగగానే నిర్వహిస్తుంది.
అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా పది మంది కూడా గుమిగూడే పరిస్థితి లేదు. ఒకవేళ గుమి గూడినా కరోనా ఎఫెక్ట్ పొంచి ఉంది. దీనికి ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు సంధించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం దీనిని వాయిదా వేసింది. అదేసమయంలో పేదల ఆత్మబంధువు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న పంపిణీకి రెడీ అంటూ ప్రకటన చేసింది. అంటే అప్పటికి కరోనా అదుపులోకి రావడంతోపాటు దళితుల పెన్నిధి అంబేద్కర్ జయంతి కూడా కలిసి వస్తుందని ప్రభుత్వం భావించింది.
అయితే, దీనిని కూడా టీడీపీ రాజకీయ రంగు పూసింది. స్థానిక ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వాయిదా వేసిందని రాజకీయ విమర్శలు ప్రారంభించింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయమని కోరిన టీడీపీ అప్పుడు సమర్దించుకుని, ఇప్పుడు ఇళ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం వాయిదా వేయడాన్ని తప్పు పట్టడంపై విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వాయిదా వేయమంటే.. అది వ్యూహాత్మకమని, అదే వైసీపీ నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యతిరేకమా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బాబు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరమీదకి తెచ్చారని మండిపడుతున్నారు.