భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం విదితమే. గత వారం కిందట ఈ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశమంతటా ఓ రకమైన కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇక గత రెండు రోజుల కిందట నుంచే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయగా కరోనా నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనుంది.
కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే భక్తులకు పంపిణీ చేయాలనుకున్న 2 లక్షల వరకు లడ్డూలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. తిరుమలకు భక్తులు రాకపోవడంతో లడ్డూలను ఎలా పంపిణీ చేయాలా అని టీటీడీ ఆలోచించింది. అయితే వాటిని ఉగాది రోజున భక్తులకు ఉచితంగానే అందివ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సదరు 2 లక్షల లడ్డూలను ఉగాది రోజున టీటీడీ భక్తులకు ఉచితంగా అందివ్వనుంది.
కాగా భారత్‌లో ఇప్పటికే 258 వరకు కరోనా కేసులు నమోదు కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 20కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అంతటా అలర్ట్ ప్రకటించారు.