ఇప్పుడు దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మైనార్టీలు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాజస్థాన్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని టోంక్ ప్రాంతానికి చెందిన నీతా కన్వార్ అనే మహిళ 18 ఏళ్ల కిందట పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి భారత్‌కు వలస వచ్చారు.
ఆమె రాజస్థాన్ లోని టోంక్ జిల్లా నట్వారా గ్రామంలో స్థిరపడ్డారు. నీతా తండ్రి, సోదరుడు పాకిస్థాన్‌లోనే స్థిరపడ్డారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడిపోయారు. ఇంటర్ వరకు సింధ్‌లోనే చదివిన నీతా ఉన్నత చదువుల కోసం తన తల్లి, సోదరితో కలిసి రాజస్థాన్‌లోని టోంక్ వచ్చి భారతీయ వ్యక్తిని వివాహం చేసుకోగా ఆమెకు 8 ఏళ్ళకు గాను భారత పౌరసత్వం లభించింది. అది అలా ఉంటే,
శుక్రవారం (జనవరి 17) రాజస్థాన్‌లో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగగా ఆమె మొదటి సారి తన ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాకుండా సర్పంచ్ గా కూడా ఎన్నికైంది. భారత పౌరసత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఆమె సర్పంచ్ గా ఎన్నికై అందరిని ఆశ్చర్యపరిచింది. తన ప్రత్యర్థి సోనా దేవిపై 400 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు ఆమె. ఇప్పుడు దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.