నిర్భయ దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు చట్టంలో ఉన్న పలు సెక్షన్లను తమకు అనుగుణంగా చేసుకుని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక తాజాగా దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీం కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో ఇప్పటికే క్యురేటివ్ పిటిషన్ పెట్టుకోగా గురువారం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టి ఆ పిటిషన్‌ను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దోషులు నలుగురికి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు కానుంది.
అయితే నలుగురు దోషుల్లో ముగ్గురు దోషులు ఇప్పటికే తమ ఉరిశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. మరి దాని వల్ల రేపు ఉరి వాయిదాపడుతుందా లేక యథావిధిగా అమలవుతుందా..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.