ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పటికి మొదలు కానున్నాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒకటి రెండు మార్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులతో ఏపీ ఆర్టీసీ అధికారులు సంప్రదింపులు జరిపారు. అయితే వీరి మధ్య చర్చలు ఎంతకీ తెగడం లేదు. దీంతో మంత్రులు ఎ విషయంలో జోక్యం చేసుకోనున్నట్టు చెబుతున్నారు. త్వరలో ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరపనున్నట్టు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడానికి విజయవాడ – హైదరాబాద్ సర్వీసు మీదనే అసలు చిక్కు వచ్చి పడింది.
ప్రతి రోజూ ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే దాదాపు 500 బస్సుల్లో 400 బస్సులు హైదరాబాద్ కే వెళ్తున్నాయి. అందుకే ఈ రూట్ సర్వీస్ మొత్తానికి తమకే అప్ప చెప్పేయాలని తెలంగాణ పట్టు పడుతోంది. దానికి బదులుగా తెలంగాణాలోని రూరల్ ప్రాంతాల్లో అవసరమైన మేరకు ఏపీ సర్వీసులను నడుపుకోవచ్చని తెలంగాణ ఆఫర్ చేసింది. కానీ ఏపీ అందుకు సుముఖంగా లేదు. కొన్ని సర్వీసులను తగ్గించుకునేందుకు ఏపీ అధికారులు సంసిద్దత వ్యక్తం చేసి, ఆ మేరకు తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడుపుకోమని చెబుతున్నా తెలంగాణ అధికారులు స్పందించడం లేదని అంటున్నారు.