భర్తలు కాదనడంతో వారంతా రోడ్డున పడ్డారు. అత్యాచారాలు, వేధింపులకు గురయ్యారని కట్టుకున్నవాడే కాదనడంతో వారి జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. మగవారిపై పూర్తిగా నమ్మకం కోల్పోయీ చావే దిక్కని భావించారు. అయితే వారిలో ఓ మహిళ అందరికీ ధైర్యం ఇచ్చింది. పురుషుల అండ లేకుండానే బతుకుదామని పిలుపునిచ్చింది. ఏకంగా ఒక ఊరినే నిర్మించుకున్నారు. ఊరి ప్రవేశమార్గం వద్ద.. ‘పురుషులకు నో ఎంట్రీ’ బోర్డు కూడా పెట్టేశారు.
కెన్యాలోని సంబురు కౌంటీలోని ఉమోజా ఉసో గ్రామం ఉంది. సంబురు తెగకు చెందిన మహిళలు ఇక్కడ పదుల సంఖ్యలో గుడిసెలు నిర్మించుకుని నివాసముంటున్నారు. కట్టెలు, గడ్డి, మట్టి, ఆవు పేడతో కుటీరాలను నిర్మించుకున్నారు. గుడిసెల చుట్టూ కంచెను కూడా ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 50 మంది మహిళలు ఉన్నారు. అయితే వీరికి అబ్బాయిలు ఉంటే 18 ఏళ్లు నిండే వరకు తల్లుల వద్ద పెరగవచ్చు. అమ్మాయిలు ఉంటే జీవితాంతం ఈ ఊరిలోనే ఉండవచ్చు. సంప్రదాయ దుస్తువులు ధరించి.. ఈ గ్రామంలో నివసిస్తున్నారు.
మూడు దశాబ్దాల కింద ఈ గ్రామం ఏర్పడింది. సంబురు తెగలో పురుషాధిక్యత ఎక్కువ. ఆడవాళ్లు కేవలం పిల్లలను కనే మిషిన్లుగా భావించేవారు. బలవంతవు వివాహాలు, గృహ హింస ఇక్కడ సర్వ సాధారమనే చెప్పుకోవచ్చు. ఓ ఘటన వీరి జీవితాన్నే మార్చేసింది. ఏకంగా ఓ గ్రామం ఏర్పాటు చేసేందుకు దారు తీసింది.
సంబురు తెగకు చెందిన 1400 మందికిపైగా మహిళలు మూడు దశాబ్దాల కిందట అత్యాచారానికి గురయ్యారు. సైనికులే అత్యాచారం చేశారట. దీంతో బాధితులను వారి భర్తలు ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి మహిళలందరూ వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తెగకు చెందిన రెబకా అనే మహిళ 1990లో 15 మందితో కలిసి గుడిసెలను కట్టుకుని గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఉమోజా గ్రామంగా పేరు పెట్టారు. కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ చేయూతతో వీరి సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నారు. వచ్చిన డబ్బుల్లో 10 శాతం గ్రామానికి పన్ను కడుతూ పిల్లల కోసం పాఠశాల నిర్వహణ, గ్రామాభివృద్ధి పనులు చేపడుతున్నారు.