మందు బాబులూ.. జాగ్రత్త.. మద్యం తెగ సేవించి ఏవైనా ప్రమాదాల బారిన పడితే అలాంటి సందర్భాల్లో మీకు ఇన్సూరెన్స్ గనక ఉండి ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు. అవును.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్వయంగా ఈ విషయాన్ని తీర్పు ద్వారా వెల్లడించింది. ఒక వ్యక్తి మద్యం మత్తులో చనిపోగా అతనికి ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు అతని ఇన్సూరెన్స్ హక్కుదారు అయిన ఓ మహిళ కోర్టుకెక్కింది. దీంతో కోర్టు ఆ విధంగా తీర్పు ఇచ్చింది.
1997వ సంవత్సరం అక్టోబర్ 7-8 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాకు చెందిన ఓ వ్యక్తి విపరీతంగా మద్యం సేవించడం వల్ల శ్వాస సరిగ్గా ఆడక మృతి చెందాడు. అయితే అతని ఇన్సూరెన్స్ హక్కుదారు అయిన నర్బదా దేవి అనే మహిళ అతనికి ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు సదరు కంపెనీని సంప్రదించింది. కానీ వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే అతను సహజంగా లేదా ప్రమాదవశాత్తూ చనిపోలేదని, మద్యం తాగడం వల్ల చనిపోయాడు కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేది లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
అందులో భాగంగానే ఆ కేసు విచారణ ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ క్రమంలో ఆమె పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌లు ఎంఎం శాంతానాగౌడర్, వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే విపరీతంగా మద్యం సేవించి ఆ కారణం వల్ల చనిపోతే వారికి ఇన్సూరెన్స్ వర్తించదని, సహజంగా లేదా ప్రమాదవశాత్తూ మరణిస్తేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తీర్పు ఇచ్చింది.