కేరళలోని తిరువనంతపురంకు చెందిన 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె దేశంలోనే యువ మేయర్‌గా త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే నిజానికి 14 ఏళ్ల కిందటే తమిళనాడుకు చెందిన ఆమె దేశంలోనే యువ మేయర్‌గా రికార్డు సృష్టించింది. అప్పుడు ఆమె వయస్సు 24 ఏళ్లు. ఆమే.. డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రేఖా ప్రియదర్శిని.
ప్రియదర్శిని 2006లో డీఎంకే హయాంలో సేలం మేయర్‌గా పనిచేశారు. ఆమె అప్పట్లో దేశంలోనే తొలి యువ మహిళా మేయర్ గా, సేలంకు తొలి మహిళా మేయర్‌గా, తొలి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మేయర్‌గా రికార్డు సృష్టించారు. కాగా ఆమె తండ్రి జగదీశ్వరన్ బ్యాంకు ఉద్యోగి. అయితే ప్రియదర్శినికి 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జగదీశ్వరన్‌కు రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన పిల్లల చదువు కోసం రాజకీయాల్లోకి వెళ్లలేదు. అయితే ప్రియదర్శిని తన తండ్రి కలను నెరవేర్చింది. ఓ వైపు పీజీ చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. మేయర్‌గా ఎన్నికైంది.
మేయర్‌గా ఆమె పనిచేసిన కాలంలో అక్కడ అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది. అప్పట్లోనే రూ.2.34 కోట్ల వ్యయంతో కక్కయన్ శ్మశానవాటికను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దగా ఆ శ్మశానవాటికకు అప్పట్లో ఐఓఎస్‌వో గుర్తింపు లభించింది. అలాగే 104 రకాల మూలికలతో ఆమె హెర్బల్ పార్క్‌ను ఏర్పాటు చేయించింది. దాన్ని కిచెన్ హెర్బల్ గార్డెన్‌గా పిలిచేవారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణకు పక్కా ప్లానింగ్ చేసి చెత్త లేకుండా సేలం కార్పొరేషన్‌ను తీర్చిదిద్దింది. కాగా ఆమె 2016 ఎన్నికల్లో గంగవల్లి (రిజర్వ్‌డ్) స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. కేవలం 2,262 ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలైనా నిత్యం నియోజకవర్గంలో ప్రజల మధ్య పర్యటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది.
అయితే ప్రియదర్శిని అప్పట్లో యువ మేయర్ అయినప్పటికీ ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తే ఆమే యువ మేయర్‌గా రికార్డు సృష్టించనుంది.