ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని… తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో లైట్ మోటారు వెహికిల్, మెకానిక్, మ్యాజిక్ ఆటో అసోసియేషన్లకు చెందిన 325 సంఘ సభ్యులకు బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకుల వస్తువులు కలిగిన కిట్స్ ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డితో కలిసి ఆయన పంచి పెట్టారు.
సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందన్న ఆయన… ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. లాక్‌డౌన్ పొడిగిస్తే ప్రభుత్వానికి సహకరిద్దామన్నారు హరీష్. ప్రస్తుతం అందరి క్రమశిక్షణ, దేవుడి దయ వల్ల సిద్దిపేటలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని సంతోషం వ్యక్తం చేసారు.
ప్రభుత్వానికి లాక్‌డౌన్ వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని తెలిసినా, సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం ముఖ్యమని తలిచారని కొనియాడారు. అందుకే లాక్‌డౌన్ అమలుకు సిద్ధపడ్డారన్నారు హరీష్. కరోనాను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని బాధ్యతగా పాటించాలన్న ఆయన… అలా సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఎవరి ఇంటిలో వారే ఉంటే కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకున్న వారిమీ అవుతామని అన్నారు.