నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇరిగేషన్ శాఖలో 879 పోస్టులు

-

రాష్ట్ర నీటిపారుదలశాఖ భారీగా కొలువుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. నీటిపారుదల శాఖలోని ఆపరేషన్స్‌ అండ్‌
మెయింటెనెన్స్‌ విభాగానికి 879 పోస్టులను మంజూరు చేసింది. ఇరిగేషన్లో కొన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం
ప్రకటించింది. కొన్ని ఇంజినీరింగ్ పోస్టులకు అనుమతులు కూడా ఇచ్చారు. తాజాగా క్షేత్రస్థాయిలో 879 పోస్టులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇవన్నీ దాదాపు 8 ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న పోస్టులే కావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్లో కిందిస్థాయి పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో ప్రాజెక్టుల గేట్ల దగ్గర కూడా మెయింటనెన్స్ లేకుండా పోయింది.

ఈ ఏడాది కురిసిన వానలతో ప్రాజెక్టులకు భారీ వరదలు రాగా.. కొన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోలేదు. దీంతో మెయింటనెన్స్ లేకపోవడమే కారణమని ఇంజినీర్లు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పోస్టులను ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు 532, ఎలక్ట్రిషియన్స్ 109, ఫిట్టర్ 50, ఆపరేటర్లు 167, ల్యాబ్స్అటెండెంట్ 10, వైర్లెస్ ఆపరేటర్లు 11 పోస్టులను క్రియేట్ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా జిల్లాల వారీగా ఈ పోస్టులను ప్రకటించారు. అయితే, ఈ పోస్టులను వీఆర్ఎ, వీఆర్వోలతో భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వీఆర్వోల సర్దుబాటు కారణంగా దాదాపు 200 మంది వరకు ఇరిగేషన్కు కేటాయించారు. వారికి ఈ పోస్టుల్లో అడ్జెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version