కరోనా నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాలసీదారులు అన్ని రకాల పాలసీలను ఆన్‌లైన్‌లోనే పొందేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇకపై పాలసీదారులకు అన్ని రకాల పాలసీలను ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు వీలు ఏర్పడింది.
కరోనా వల్ల పాలసీలను తీసుకునేందుకు అవసరమైన ఫిజికల్ ప్రూఫ్‌లను కస్టమర్ల నుంచి సేకరించడం, మళ్లీ పాలసీ ఇష్యూ అయ్యాక ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్లను ప్రింట్ చేసి కస్టమర్లకు అందజేయడం, పోస్టులో పంపడం చాలా ఇబ్బందిగా ఉందని ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఆర్‌డీఏఐకు తెలిపాయి. దీంతో స్పందించిన ఆ సంస్థ ఇన్సూరెన్స్ కంపెనీలకు డిజిటల్ పద్ధతిలో పాలసీలను ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. దీని వల్ల కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాలసీ పొందగానే వారికి డిజిటల్ పద్ధతిలో పాలసీ కాపీని అందజేయాలి.
ఇక ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ను పొందినప్పటికీ కస్టమర్ కోరితే ఫిజికల్ కాపీలను కచ్చితంగా కంపెనీలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఆ పాలసీ తీసుకున్న తేదీ నుంచి 30 రోజుల పాటు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో పాలసీ నచ్చకపోతే కస్టమర్ ఎలాంటి చార్జిలు లేకుండా పాలసీని రద్దు చేసుకుని చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకు కంపెనీలు ఎలాంటి చార్జిలు వసూలు చేయరాదు. పాలసీ తీసుకున్న వెంటనే ఆ కాపీని కస్టమర్ ఈ-మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. ఈ రూల్స్ అన్నీ ప్రస్తుతం అమలులోకి వచ్చాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది.