వారెవ్వా.. 100 శాతం సమయపాలనతో నడుస్తున్న రైళ్లు..!

-

భారతీయ రైళ్లు అంటే.. ఎప్పుడూ చెప్పిన టైముకు రావు.. అనే నింద ఉండేది. చాలా ఆలస్యంగా రైళ్లు నడుస్తాయని జనాలు గొణుక్కుంటారు. కానీ ఇకపై ఆ అపవాదు రైల్వేశాఖకు ఉండదు. ఎందుకంటే రైల్వే ప్రస్తుతం 100 శాతం కచ్చితమైన టైముకు రైళ్లను నడిపిస్తోంది. చెప్పిన టైముకు, చెప్పిన స్టేషన్‌లో రైళ్లు కచ్చితంగా ఆగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే శాఖే తాజాగా వెల్లడించింది.

కరోనా లాక్‌డౌన్‌ వల్ల దేశంలో ప్రస్తుతం కేవలం స్పెషల్‌ రైళ్లను మాత్రమే నడిపిస్తున్నారు. మొత్తం 230 రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఈ రైళ్లు 100 శాతం సమయపాలనను పాటిస్తున్నాయి. జూన్‌ 23వ తేదీన ఈ రైళ్లు 99.54 శాతం సమయపాలనతో నడిచాయి. కానీ ఇప్పుడు అది 100 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ఆ రైళ్లన్నీ సరైన టైముకు స్టేషన్లలో ఆగుతున్నాయి.

ఇక ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబైల మధ్య ఉన్న రైలు మార్గాన్ని అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ మార్గాల్లో రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. భవిష్యత్తులో ఈ మార్గాలను మరింత అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. దీంతో రైళ్లు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. అయితే ప్రస్తుతానికి చాలా తక్కువ రైళ్లను నడిపిస్తున్నందున సమయపాలన పాటించడం తేలికవుతుందని, కానీ రైళ్లన్నింటినీ నడిపిస్తే 100 శాతం సమయపాలన పాటించడం కొద్దిగా కష్టతరమవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం రైల్వే శాఖ సాధించింది చారిత్రాత్మకం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. సమయపాలన పాటించలేదు. కానీ భవిష్యత్తులో కరోనా పూర్తిగా తగ్గి పరిస్థితి మామూలుగా అయితే.. రైళ్లను ఇలాగే 100 శాతం సమయపాలనతో నడిపిస్తే.. నిజంగా జనాలకు అంతకు మించి కావల్సింది ఏమీ లేదు. ఎంతో డబ్బు, శ్రమ, సమయం ఆదా అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version