నెటిజన్లు తమకు నచ్చని విషయాలపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని బాయ్‌కాట్ రూపంలో వెలిబుచ్చుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైంది. వ్యక్తులు, ఉత్పత్తులు, సినిమాలు.. ఇలా ఏదైనా కావచ్చు, నచ్చకపోతే వాటి పేరిట బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ చేర్చి దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో జ్యువెల్లరీ సంస్థ తనిష్క్‌కు నెటిజన్ల సెగ బాగానే తగిలింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి అమెజాన్ వచ్చి చేరింది.
అమెజాన్ యూరప్ సైట్లో ఓం సింబల్రాసి ఉన్న గ్రీన్ కలర్ డోర్ మ్యాట్లను విక్రయిస్తున్నారు. ఒక్కో మ్యాట్‌ను 15.78 యూరోలకు అమెజాన్‌లో అమ్ముతున్నారు. అయితే దీనిపై కొందరు ఫైరవుతున్నారు. వెంటనే అమెజాన్ ఆ డోర్మ్యాట్లను తన సైట్ నుంచి తీసేయడంతోపాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తున్నారు. అలాగే ట్విట్టర్లో #BoycottAmazon పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
అమెజాన్‌లో భారత వినియోగదారులు వస్తువులను కొనవద్దని, కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై అమెజాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. కానీ అమెజాన్ ఇండియా సైట్లో అలాంటి మ్యాట్లు కనిపించడం లేదు. కేవలం అమెజాన్ యూరప్ సైట్లోనే అవి దర్శనమిస్తుండడం విశేషం.