కరోనా వల్ల నష్టపోయిన వీధి వ్యాపారులకు రుణం అందించడం కోసం కేంద్రం ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) స్కీంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీంకు గాను కేంద్రం బుధవారం కొత్తగా ఓ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ కేవలం ఈ స్కీం కింద రుణాలను ప్రాసెస్ చేసే స్థానిక సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ సహాయంతో వారు వీధి వ్యాపారుల అప్లికేషన్లను మరింత వేగంగా ప్రాసెస్ చేయవచ్చు. దీంతో వారికి త్వరగా లోన్ అందుతుంది.
పీఎం స్వనిధి స్కీం కింద వీధి వ్యాపారులకు రూ.10వేల రుణం ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాల్లో ఏడాదిలోగా చెల్లించాలి. అలా చెల్లిస్తే 7 శాతం వడ్డీని సబ్సిడీ కింద అందిస్తారు. ఆ మొత్తం వ్యాపారుల బ్యాంక్ ఖాతాలకే నేరుగా డీబీటీ పద్ధతిలో బదిలీ అవుతుంది. అలాగే నెలకు రూ.100 చొప్పున క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్‌లను కూడా ఈ లోన్‌లో అందిస్తారు.
జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అందుబాటులోకి రాగా.. జూలై 2వ తేదీ వరకు దీని కింద 5.68 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలోంచి ఇప్పటికే 1.30 లక్షల మందికి రుణాలను కూడా అందించారు. ఇక తాజాగా స్థానిక సంస్థల కోసం కొత్త యాప్ ను కూడా ప్రవేశపెట్టడంతో వీధి వ్యాపారులు ఇకపై రుణాలను మరింత వేగంగా పొందుతారు.