తనిఖీల్లో భాగంగా కేరళలో నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినుల లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసింది. దీనిపై కొందరు విద్యార్థినులు ఆరోపించడంతో వివాదాస్పదమైంది. అయితే తాజాగా ఈ విషయంపై నీట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పందించింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే నీట్ పరీక్ష విషయంలో తల్లిదండ్రుల ఆరోపణలు చేసిన తరహాలో ఎలాంటి చర్యలను అనుమతించలేదు. వివిధ వర్గాల సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకునే నీట్ పరీక్షలు నిర్వహిస్తామని నీట్ పేర్కొంది.
అసలు విషయానికి వస్తే.. ఆదివారం కేరళలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. తనిఖీల్లో భాగంగా లోదుస్తువులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసిందని కొందరు విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన కొల్లాం జిల్లాలోని ఆయుర్‌లో మార్థోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకుంది. లోదుస్తువులు విప్పాలని, అప్పుడే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దీనిపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పరీక్ష అనంతరం లోదుస్తువుల బుట్టను కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయంపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.