ప్రముఖ క్యాబ్ ఆపరేటింగ్ సంస్థ ఓలా.. దేశంలో తిరిగి క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని 100 నగరాల్లో క్యాబ్ సేవలను ప్రారంభిస్తామని ఓలా సోమవారం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం.. సామాజిక దూరం పాటిస్తూ క్యాబ్‌ను నడుపుతామని, మాస్కులను తప్పనిసరిగా ధరింపజేస్తామని, అలాగే ప్రయాణికులకు నాన్ ఏసీ రైడ్లను మాత్రమే అందిస్తామని.. ఓలా తెలిపింది.
కాగా లాక్‌డౌన్ 3.0 నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కేంద్రం ఆంక్షలను సడలించగా.. క్యాబ్ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఓలా క్యాబ్స్ తిరిగి తన సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇక కార్లలో కేవలం ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. డ్రైవర్ పక్క సీటులో ఒకరు, వెనుక సీట్లలో ఒక్కరు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది.
అయితే దేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాలన్నింటిలోనూ రెడ్ జోన్లు ఉన్నందున ఆ మెట్రో నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఇప్పుడప్పుడే ప్రారంభించే అవకాశం లేదు. కానీ ఇతర నగరాలు, పట్టణాల్లో క్యాబ్ సేవలు ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంది.