కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాడైన, పనికిరాని, సర్వీస్ ముగిసిన డొక్కు బస్సులతోనూ ఏటా రూ.లక్షల్లో ఆదాయం పొందవచ్చని నిరూపిస్తోంది. అందుకు గాను పాత బస్సులను వారు భిన్న రకాలుగా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఆ బస్సులకు కొంత మార్పులు, చేర్పులు చేసి వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. అనంతరం వాటిల్లో షాప్స్ పెడుతున్నారు. అలాగే వాటిని డ్రైవర్లు, కండక్టర్ల కోసం రెస్ట్ రూంలుగా కూడా వాడుతున్నారు.
సాధారణంగా ఒక్కో పాత బస్సును స్క్రాప్‌లో అమ్మితే రూ.1.50 లక్షలు వస్తాయి. అదే వాటిని మార్చి పైవిధంగా వాటిని షాపులుగా ఏర్పాటు చేసుకుంటే ఎంత లేదన్నా 5 ఏళ్లలో వాటితో కనీసం రూ.12 లక్షల వరకు అయినా సంపాదించవచ్చని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బిజు ప్రభాకర్ తెలిపారు. అందుకనే వాటితో ఆదాయం సంపాదించేందుకు వాటికి మార్పులు, చేర్పులు చేస్తున్నామని తెలిపారు. వాటి పట్ల ప్రభుత్వ ఏజెన్సీలే కాక, ప్రైవేటు కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్నారు.
కాగా కేఎస్ఆర్టీసీ ఆ విధంగా రూపొందించిన ఓ బస్-టర్న్‌డ్-కియోస్క్‌ను తిరువనంతపురం సిటీలో ప్రస్తుతం ఏర్పాటు చేశారు. దాన్ని కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేశారు. అందులో పాలు, పాల సంబంధ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీంతో అదనపు ఆదాయం వస్తుందని బిజు ప్రభాకర్ తెలిపారు. కరోనా నేఫథ్యంలో కేఎస్ఆర్టీసీకి భారీగా నష్టం వస్తుందని, అందువల్ల ఆ నష్టాన్ని కొంత వరకు అయినా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో పాత బస్సులను ఇలా మార్చి అందిస్తున్నామని తెలిపారు. కాగా ఆ బస్-కియోస్క్‌లు ప్రస్తుతం అక్కడ చాలా మంది ఔత్సాహికులను కూడా ఆకట్టుకుంటుండడం విశేషం.