గంగానది ప్రక్షాళన కోసం గత నాలుగు నెలల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ తుది శ్వాస విడిచారు. ఆయనకు 87 ఏళ్లు. ఆయన అసలు పేరు స్వామి న్ స్వరూప్ సనంద్. ఆయన సామాజిక వేత్త కూడా. గంగానదిని శుద్ధి చేయాలని జూన్ 22న ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. అయితే.. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన దీక్షను భగ్నం చేసి చికిత్స నిమిత్తం ఆయన్ను హరిద్వార్ నుంచి రిషికేష్ లో ఉన్న ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు గుండెనొప్పి రావడంతోనే మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.
పవిత్రమైన గంగానదిని ప్రక్షాళన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. కానీ.. ఆయన దీక్షను ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. గత రెండు రోజుల కిందట గంగా ప్రక్షాళనపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. దీంతో ఆయన రోజూ తీసుకునే మంచినీళ్లను కూడా తాగడం మానేశారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
కాన్పూర్ ఐఐటీలో అగర్వాల్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అనంతరం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ కార్యదర్శిగానూ సేవలందించారు. ఇదివరకు చాలాసార్లు నదుల పరిరక్షణ కోసం దీక్షలు చేశారు. 2009 లో కూడా ఇలాగే దీక్ష చేస్తే.. ప్రభుత్వం భగీరథి నదిపై నిర్మించాలనుకున్న డ్యామ్ నిర్మాణాన్ని నిలిపేశారు.