దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలలో పలు చోట్ల లాక్‌డౌన్‌ను పొడిగించారు. కేరళ, కర్ణాటకలలో ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకే రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. అయితే మరోవైపు రానున్న రోజుల్లో కేంద్రం కూడా మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుందని గతంలో సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. కానీ ఆ విషయంపై కేంద్ర హోం శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా లాక్‌డౌన్ పెట్టబోమని తెలిపారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూస్తుంటే మరోసారి లాక్‌డౌన్ అనివార్యమని నిపుణులు అంటున్నారు. అందువల్ల కేంద్రం మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉందని, జూలై 15 నుంచి లాక్‌డౌన్ ఉండవచ్చని అంటున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం మనకు ఇది వరకే స్పష్టమైంది.
దేశంలో లాక్‌డౌన్ విధించుకునే సదుపాయాన్ని, గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లుగా ప్రకటించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. కరోనా కట్టడికి కేంద్రం రాష్ట్రాలకు పూర్తి అధికారాలను అప్పగించింది. అందువల్ల మోదీ ఇక దేశవ్యాప్త లాక్‌డౌన్ పెట్టడం ఉండదని అన్నారు. ప్రస్తుతం మన అన్‌లాక్ వైపుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కనుక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అనేది ఉండదు. కానీ రాష్ట్రాలకు ఇప్పుడు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి కనుక అవే ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ ఉన్న చోట్ల లాక్‌డౌన్ పెడుతున్నాయి. కరోనా కట్టడికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల కరోనా కట్టడి బాధ్యత కూడా ఇప్పుడు పూర్తిగా రాష్ట్రాలకే ఉంది. కేంద్రం కేవలం సహాయ సహకారాలు మాత్రమే అందిస్తోంది. కనుక.. దేశంలో ఇక లాక్‌డౌన్ ఎట్టి పరిస్థితిలో ఉండదని, అవసరం అనుకున్న చోట్ల రాష్ట్రాలే లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంటాయని.. మనకు స్పష్టమవుతుంది.
ఇక ఆగస్టు 15వ తేదీ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ చేపట్టాయి. అందుకు మరో నెల రోజుల గడువు మాత్రమే ఉంది. కనుక అంత వరకు వేచి చూస్తే అయిపోతుంది కదా.. మళ్లీ లాక్‌డౌన్ ఎందుకు ? అని కూడా కేంద్రం, పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ వరకు వచ్చినా.. రాకున్నా… కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.