పాకిస్థాన్‌లో మే 22వ తేదీన కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది చనిపోయారు. అయితే పైలట్లు విమానాన్ని ల్యాండింగ్ చేయించడంలో విఫలం అయ్యారని, ఎయిర్ టవర్ ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందునే ఆ విమానం కూలిందని తాజాగా వెల్లడైంది. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. పాకిస్థాన్‌లో నకిలీ పైలట్లు విమానాలు నడుపుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ వెల్లడించడం గమనార్హం.
పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న ఖాన్ సదరు విమానప్రమాద ఘటనపై వివరాలను వెల్లడించారు. పైలట్ల తప్పిదం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఇక పాకిస్థాన్‌లో విమానాలను నడుపుతున్న పైలట్లలో 30 శాతం మందికి లైసెన్సులు లేవని, వారంతా ఫేక్ లైసెన్సులతో పైలట్లుగా పనిచేస్తున్నారని తమ విచారణలో తేలిందని ఆయన తెలిపారు. ప్రతి ముగ్గురు పైలట్లలో ఒక పైలట్‌కు అసలు విమానాన్ని నడిపిన అనుభవమే లేదని, వారు అనర్హులని తెలిపారు. వారు నకిలీ లైసెన్సులతో పైలట్లుగా చెలామణీ అవుతున్నారని అన్నారు.
పాకిస్థాన్‌లో మొత్తం 850 మంది పైలట్లు విమానాలను నడిపిస్తున్నారు. వారిలో కొందరు పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన పీఐఏలో పైలట్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో మొత్తం 260 మంది పైలట్లు నకిలీ అని తమ విచారణలో వెల్లడైందని ఆ మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా పైలట్లను గుర్తించే పనిలో పడినట్లు వివరించారు. వారందరూ కొందరు బ్రోకర్లకు ఫీజు చెల్లించి నకిలీ లైసెన్సులు పొంది పైలట్లుగా పలు విమాన సర్వీసు సంస్థల్లో పనిచేస్తున్నారని అన్నారు. త్వరలోనే ఆ నకిలీ పైలట్లందరినీ గుర్తిస్తామని అన్నారు.