టీడీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పనున్నారా? ఎక్కడ పోటీ చేసినా.. విజయమే తప్ప.. పరాజయం ఎరుగని ఆ నేత చంద్రబాబు వైఖరితో విసిగిపోయారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఆ కీలక నేతే.. మాజీ మంత్రి పీతల సుజాత. రాజకీయాల్లోకి అడుగులు వేసి స్వల్పకాలమే అయినప్పటికీ.. ఎక్కడ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కే నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 2004లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ జెండాను ఎగరేశారు. తర్వాత.. 2014 ఎన్నికల్లో ఇదే జిల్లాలోని చింతలపూడి నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు.
వాస్తవానికి ఒక మహిళ.. అందునా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నాయకురాలు.. ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కడం చాలా చాలా తక్కువ మందికే సాధ్యం. అలాంటి అసాధ్యమైన విజాయన్ని పీతల సుజాత సాధించారు. అదే సమయంలో పార్టీ పట్ల ఎంతో విధేయురాలిగా ఉండేవారు. చంద్రబాబు చెప్పినట్టు చేసేవారు. ఇక, తనను 2014లో మంత్రిని చేసినప్పుడు.. 2017లో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ పదవిని తొలగించినప్పుడు కూడా సుజాత పెద్దగా ఫీల్ కాలేదు. ఒక వేళ అయినా.. ఎక్కడా బయటకు చెప్పుకోలేదు. అంటే.. కొన్ని కొన్ని అవమానాలను సైతం ఆమె భరించారు.
అయితే, గత ఏడాది ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అయినా.. చింతలపూడిలో కర్రా రాజారావు గెలుపు కోసం ప్రయత్నించారు. అయినప్పటికీ.. వివిధ కారణాలతో రాజారావు ఓడిపోయారు. దీంతో ఆయన నియోజక వర్గానికి చాలా దూరంగా ఉంటున్నారు. కానీ, సుజాత మాత్రం నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. అయినప్పటికీ. పార్టీలో గుర్తింపు లభించలేదు. ఇటీవల చంద్రబాబు.. ఎంతో మందికి పదవులు కట్టబెట్టారు. కానీ, సుజాత విషయానికి వస్తే.. శీతకన్నేశారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన సుజాత.. ఇటీవల నారా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు దూరంగా ఉన్నారు.
అంతేకాదు.. పార్టీ కార్యాలయానికి కూడా రావడం మానేశారు. ఇక, ఆమె అనుచరులే స్వయంగా పార్టీ కార్యాలయం వద్ద సుజాత ఫొటోతో ఉండే భారీ పోస్టర్‌ను తొలగించారు. ఈ పరిణామాలను బట్టి.. సుజాత ఇక.. టీడీపీకి బై చెబుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే నాయకురాలు.. నిబద్ధతకు మారు పేరు వంటి సుజాత వంటి నేతలను కూడా బాబు నిలుపుకోలేక పోవడం దారుణమని అంటున్నారు విశ్లేషకులు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.