సరిగ్గా ఏడాది క్రితం దుర్ఘటన.. ఇంకా మానని గాయం

-

విశాఖ: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విశాఖనగరం విలవిలలాడిపోయింది. తెల్లవారకముందే విషవాయువు విడుదలైంది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. వేలాది మందిని ఆస్పత్రి పాలు చేసింది. విశాఖ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో స్టైరీన్ గ్యాస్ గత సంవత్సరం మే 7న లీకైంది. ఆ గ్యాస్‌ పీల్చిన వెంకటాపురం, నందమూరి నగర్‌, వెంకటాద్రి గార్డెన్స్‌, జనతా కాలనీ, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం కాలనీ వాసులు కుప్పకూలిపోయారు. ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకుని దూరంగా వెళ్లేందుకు పరుగులు తీశారు.

ఆ ఘటన స్థానికుల జీవితాల్లో పీడకలగా మిగిలింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన మానని గాయంగానే బాధితులకు మిగిలిపోయింది. భారీ స్థాయిలో ప్రమాదం జరిగినా ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారికి పరిహారం అందించలేదని బాధితులు చెబుతున్నారు. వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 150 మందికి ప్రభుత్వం అందజేస్తామన్న రూ.10 వేల పరిహారం నేటికీ అందలేదని అంటున్నారు. ఇప్పటి నుంచి తమ ఆరోగ్యం బాగా ఉండటం లేదని, ఆనారోగ్యాలు వెంటాడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news