తెలంగాణ ఆర్టీసీ సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విధులకు హాజరుకావొద్దంటూ ఆర్టీసీ కార్మికులువిజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ బంద్ తర్వాత ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం డిపోల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ దగ్గర వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు నిరసనలు చేపట్టారు.
అంతేకాకుండా నిజామాబాద్ వన్ డిపో లోపలికి వెళ్లేందుకు క్యూలో నిలబడ్డ తాత్కాలిక సిబ్బంది కాళ్లపై పడ్డారు. కాళ్లు మొక్కుతాం విధులకు హాజరుకావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తమ సమ్మెకు సహకరించాలని కోరారు. గడ్డాలు పట్టుకుని బతిమిలాడారు. ఇటు పోలీసులు కూడా డిపో ఎదుటభద్రత ఏర్పాటు చేశారు. ఇటు కరీంనగర్ బస్‌స్టాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్టాండ్‌లో పార్క్ చేసిన ఉన్న ప్రైవేట్ హైర్ సర్వీస్ బస్ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మరోవైపు ఉదయం 5 గంటలకే కరీంనగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు.