పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు(అక్టోబరు 13 వ తేదీన) ఉదయం 06.30 – 07.30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడకు దగ్గరలో తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 km నుండి 65 km గరిష్టంగా 75 km వేగంతో గాలులు వీచాయి. ఇక ఆ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల వలన వనపర్తిలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో అత్యల్పంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.