అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా నిఘా విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా నిఘా విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా హమ్జా బిన్ లాడెన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా చనిపోయాడనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం హమ్జా ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం హమ్జా చనిపోవడం అంతర్జాతీయంగా సంచలనం కలిగిస్తోంది.
కాగా హమ్జా వయస్సు సుమారుగా 30 సంవత్సరాల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో అతను అమెరికా, ఇతర దేశాల మీద దాడులు చేయాలంటూ పలు ఆడియోలు, వీడియోలను కూడా విడుదల చేశాడు. ఇక హమ్జా మృతి చెందాడన్న వార్తను తొలుత ఎన్‌బీసీ, న్యూయార్క్ టైమ్స్‌లు వెల్లడించాయి. కాగా హమ్జా మృతి వార్తపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. అందుకు ఆయన సమాధానం చెప్పేందుకు అంగీకరించలేదు. మరోవైపు వైట్ హౌజ్ జాతీయ సెక్యూరిటీ సలహాదారు జాన్ బోల్టన్ కూడా ఈ వార్తపై జవాబివ్వలేదు.
అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను 2011 మే నెలలో హతమార్చిన విషయం విదితమే. అయితే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని గతంలో హమ్జా బిన్ లాడెన్ జిహాదీలకు పిలుపునిచ్చాడు. అలాగే అరేబియా ద్వీపకల్పంలోని ప్రజలను కూడా హమ్జా ఇదే విషయంపై కోరిక కోరాడు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా గత మార్చి నెలలో హమ్జా పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆ తరువాత హమ్జా ఇరాన్‌లో హౌజ్ అరెస్టు అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అతను ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, సిరియాలలో పలు సమయాల్లో నివాసం ఉన్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కాగా హమ్జా వివాహం మరొక అల్‌ఖైదా సీనియర్ నేత కుమార్తెతో జరిగిందని తెలిసింది. ఈ మేరకు అమెరికా దళాలకు ఓ వీడియో కూడా లభ్యమైందని సమాచారం. ఆ వివాహం ఇరాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
1998లో టంజానియా, కెన్యాలలోని అమెరికా ఎంబస్సీలపై బాంబు దాడులు జరగ్గా వాటికి సూత్రధారి హమ్జా కొత్త మామ అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా లేదా అబూ మహమ్మద్ అల్-మస్రీలు కారణమని వార్తలు వచ్చాయి. అయితే 2001 సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిపిన దాడుల తరువాత అల్‌ఖైదా ప్రభావం తగ్గి ఆ సంస్థ బలహీనపడిపోయింది. ఇక అప్పట్లో హమ్జా చిన్న పిల్లవాడు కానీ.. ఇప్పుడు అతనికి వయస్సు 30 ఏళ్ల వరకు ఉంటుందని, కానీ అది కూడా కచ్చితంగా చెప్పలేమని అమెరికా దళాలు అంటున్నాయి. అయితే హమ్జా మృతిని అమెరికా ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. మరికొద్ది గంటల్లో ఈ విషయంపై అమెరికా వైట్ హౌజ్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది..!