ఉన్నావ్ అత్యాచార ఘటనతోపాటు దాని అనంతరం జరిగిన పలు పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ఉన్నావ్ అత్యాచార ఘటనతోపాటు దాని అనంతరం జరిగిన పలు పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించిన అన్ని కేసులను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ 12 గంటల వరకు ఈ కేసు దర్యాప్తుకు చెందిన వివరాలను సీబీఐ సమర్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఉన్నావ్ అత్యాచార ఘటనతోపాటు ఆ ఘటనలో బాధితురాలి కారును తాజాగా లారీ ఢీకొన్న మరో ఘటనపైనా వివరాలను సమర్పించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటల వరకు సీబీఐ నుంచి బాధ్యత కలిగిన ఓ అధికారిని పిలిపించాలని.. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు వివరించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా ని ఆదేశించారు.
కాగా చీఫ్ జస్టిస్ ఆదేశాల ప్రకారం.. తుషార్ మెహ్తా మరోవైపు సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు లక్నోలో ఉన్నారని, అందువల్ల వారు మధ్యాహ్నం వరకు ఢిల్లీకి వచ్చి సుప్రీం కోర్టుకు వివరాలను తెలపడం వీలు పడదని మెహ్తా సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కేసును రేపటి వరకు వాయిదా వేయాలని సీబీఐ చీఫ్ కోరారని మెహ్తా చీఫ్ జస్టిస్‌కు తెలిపారు. అయితే చీఫ్ జస్టిస్ గొగోయ్ సీబీఐ చీఫ్ విన్నపాన్ని తిరస్కరించారు. ఫోన్‌లో దర్యాప్తు అధికారుల నుంచి వివరాలను తెలుసుకోవాలని సీబీఐ డైరెక్టర్‌కు చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. అవే వివరాలను మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రీం కోర్టు బెంచ్‌కు తెలపాలన్నారు. కాగా ఈ కేసును విత్‌డ్రా చేసుకోవాలని చెప్పి ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనుచరుల నుంచి అత్యాచార బాధితురాలికి, ఆమె బంధువులకు బెదిరింపులు వస్తున్నాయని కూడా బాధితురాలి కుటుంబం చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది..!