వారంతా ఉండటానికి కనీసం గూడు లేని వారు. ఎక్కడపడితే అక్కడ ఇంత చోటు దొరికితే నిద్రపోతారు. రోజంతా దొరికిన పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటారు. రాత్రయితే ఏదో ఓ మూలన నిద్రిస్తారు. అలా నిన్న రాత్రి డివైడర్‌పై నిద్రించారు. రోజూ రోడ్లపైనే నిద్రిస్తున్నా.. ఏరోజూ వారు ప్రమాదాల గురించి ఆలోచించలేదు. వాటికి భయపడలేదు కూడా. కానీ నిన్న రాత్రి నిద్రే ఆఖరిదవుతుందని ఊహించలేకపోయారు.
డివైడర్‌పై నిద్రిస్తున్న ఆరుగురిపై ఓ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దిల్లీలోని సీమాపురిలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి 1.51 గంటలకు డీటీసీ డిపో రెడ్‌లైట్‌ను దాటుతున్న ఓ ట్రక్ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమో లేక డ్రైవర్ మద్యం మత్తలోనే లేక నిద్ర మత్తులోనే ఈ ప్రమాదం చేసి ఉంటాడని భావిస్తున్నారు.