ఏపీలో అధికార వైసీపీలో అతి మర్యాద ఇప్పుడు ఆ పార్టీలో గుబులు రేపుతోంది. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజానాచౌదరి వైసీపీకి చెందిన కొంతమంది ఎంపీలు, ముఖ్యనేతలు పార్టీలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్రాతి తీవ్రంగా వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీలో కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని, పార్టీ అవసరాన్ని బట్టి వారిని తీసుకునే అవకాశముందని చెప్పుకొచ్చారు. అయితే ఎవరెవరూ టచ్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు.
ఎంపీలే కాక కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా బీజేపీ ముఖ్యనేతలకు టచ్‌లోకి వస్తున్నారని అన్నారు.పార్టీలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై బీజేపీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పడం గమనార్హం. బీజేపీలోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు వరుస ప్రకటనల నేపథ్యంలో అందరి దృష్టి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై పడింది. ఆయన కొద్దికాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ధిక్కారం స్వరం వినిపిస్తున్నారని జగన్ భావించి దూరం పెట్టినట్లుగా పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో తనకు ఎదురుపడిన ఇటీవల తనకు ఎదురు పడిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి.. ”రాజు గారు” అంటూ పలకరించారట. ఈ విషయంపై రకరకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
‘నమస్కారం పెడితే.. ప్రతి నమస్కారం చేయడం ప్రధాని మోదీ సంస్కారం. అంతమాత్రాన ఏదో ఊహించుకోవడం సరికాదు’ అని సుజాన చౌదరి కొట్టిపారేశారట. రఘురామకృష్ణంరాజు గతంలో బిజెపిలో కొంతకాలం పనిచేసినందునే ఆ పరిచయంతో మోదీ ఆయన్ను పలకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా… బీజేపీ వైసీపీ ఎంపీలకు కావాలనే అతి మర్యాద ఇస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఓ వైపు టీడీపీ మీద కన్నేసిన బీజేపీ ఇప్పుడు వైసీపీపైనా దృష్టి సారించిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్ర స్థాయిలో లాబీయింగ్ అవసరం అయిన వైసీపీ ఎంపీలు, వ్యాపారాలు ఉన్న వారిపై కూడా ఆ పార్టీ దృష్టి పెట్టినట్టు టాక్ వస్తోంది.
అయితే ఈ అతి మర్యాద వైసీపీలో కలకలం రేపుతున్నా వైసీపీ నేతలు మాత్రం మోదీ గతంలో కూడా విజయసాయిరెడ్డిని విజయ్ గారు అని పలకరించిన సంగతి గుర్తు చేస్తున్నారు. న్యూఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతుండగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా హస్తినలోనే ఉన్నారు. వలసల బాధ్యతను తీసుకున్న సుజనాచౌదరి తన యాక్షన్ ప్లాన్‌కు ఈ సెషన్‌లోనే ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది.