నిజామాబాద్ బీజీపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయపార్టీలో సంచలన కామెంట్స్‌కు అర్వింద్ ఓ బ్రాండ్ అని టాక్ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీని తన పంచ్ డైలాగులతో పలుమార్లు ఇరకాటంలో పడేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అర్వింద్.. తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఎంపీ అర్వింద్ సంచలన విమర్శలు చేశారు. దేశంలోని ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఈ బిల్లును ఐఎంఐం పార్టీ దాని మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అర్వింద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని దేశం వదిలి వెళ్లిపోవాలని కోరాడు. ‘పార్లమెంట్‌లో ఏది పాసైతే, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. లేదా దేశం వదిలి వెళ్లిపోండి. ఎంఐఎం పార్టీ చెత్త బ్యాచ్ తయారైంది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.