కరోనా వ్యాక్సిన్.. సెప్టెంబర్ నాటికి 6 కోట్ల డోసులు సిద్ధం!

-

కరోనా మహమ్మారి రోజురోజుకు ఉధృతి పెంచుకుంటూ పోతున్న వేళ.. దానికి వ్యాక్సిన్ కనిపెట్టడాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతగానో శ్రవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌కు సంబంధించిన పరిశోధనల్లో ముందంజలో ఉంది. ఇప్పటికే హ్యుమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించింది.

అయితే ఇప్పటికే కోతులపై జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాకీ మౌంటెన్ ల్యాబొరేటరీలో ఆరు కోతులపై గత నెలరోజులుగా పరిశోధనలు జరిగాయి. ఈ వ్యాక్సిన్ ఇన్‌జెక్ట్ చేసిన తర్వాత కోతులకు అధిక వైరస్‌ సోకేలా ఏర్పాటు చేశారు. అయితే 28 రోజుల తర్వాత అన్ని కోతులూ ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. కోతులపై సక్సెస్ కావడంతో ఇప్పుడు మనుషులపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు మొదలుపెట్టారు. ఇప్పటికే 550 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. వచ్చే నెలాఖరులోపు 6వేల మంది మనుషులపై ఈ ప్రయోగం పూర్తికానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురిపై ఈ పరిశోధన కొనసాగుతోంది. వచ్చే నెలాఖరుకు మనుషులపై ప్రయోగ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని ఈ వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, వ్యాక్సిన్ల తయారీకి పేరుగాంచిన పుణే సీరమ్ ఇనిస్టిట్యూట్.. ఆక్సఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ల తయారీని భారత్‌కు చెందిన పుణే సీరమ్ ఇనిస్టిట్యూట్ వచ్చే నెలలో ప్రారంభించనుంది. సెప్టెంబర్ నాటికి 6 కోట్ల డోసులు రిలీజ్ చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాదికి 40 కోట్ల డోసులను అందించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. వ్యాక్సిన్ ధరను సీరమ్ రూ.1000గా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తనకు ఈ వ్యాక్సిన్‌పై పూర్తి విశ్వాసం ఉందని.. ఇందుకు సంబంధించిన సాంకేతికతను గతంలో ఉపయోగించామని వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నప్రొఫెసర్ సారా గిల్బర్ట్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news