కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు విధించిన లాక్‌డౌన్ మరో 4 రోజుల్లో ముగియనుంది. దీంతో ఆ తరువాత మోదీ ఏం చేస్తారు..? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా, ఎత్తేస్తారా..? అసలు లాక్‌డౌన్ విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..? అని ఇప్పుడు యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి హాంగ్‌కాంగ్ మీద పడింది. ఎందుకంటే.. అక్కడ కరోనా కేసులు ఉన్నప్పటికీ లాక్‌డౌన్ లేదు. అయినా వారు కరోనాను కట్టడి చేశారు. దీంతో అదే మోడల్‌ను భారత్‌లోనూ అమలు చేయాలని నిపుణులు అంటున్నారు. అయితే.. ఇంతకీ కరోనా కట్టడికి హాంగ్‌కాంగ్ అనుసరించిన మోడల్ ఏమిటి..? అంటే..
హాంగ్‌కాంగ్ జనాభా 75 లక్షలు. బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్ నగరాలంత జనాభా అక్కడ ఉంటుంది. అక్కడ జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 2న 100వ కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు అక్కడ 1038 కరోనా కేసులు నమోదు కాగా.. 4 మంది మృతి చెందారు. అయితే కరోనా కట్టడిలో హాంగ్‌కాంగ్ 100 శాతం విజయవంతమైంది. దీంతో ఆ దేశ మోడల్‌ను అనుకరించాలని అందరూ యత్నిస్తున్నారు.
* కరోనా కట్టడికి హాంగ్‌కాంగ్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మాస్కులు ఉంటేనే ప్రజలను బయట తిరిగేందుకు అనుమతించారు. అలాగే సోషల్ డిస్టాన్స్‌ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వం చెప్పిన సూచనలను అక్కడి ప్రజలు కూడా ఏమాత్రం పొల్లుపోకుండా.. తూ.చా. తప్పకుండా పాటించారు.
* విదేశాల నుంచి వచ్చిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా పేషెంట్లను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు.
* కరోనా వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను 100 శాతం సేకరించారు. వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
* దేశంలోని ప్రజలపై నిరంతరం నిఘా పెట్టారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్‌ను పాటించడంపై విస్తృతంగా ప్రచారం చేశారు.
* కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రదేశాల్లో మాస్కులతో ప్రజలను తిరిగేందుకు అనుమతించారు. ఆయా చోట్ల 100 శాతం శానిటైజేషన్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు తిరిగారు. ప్రజా రవాణాలోనూ 100 శాతం సామాజిక దూరం పాటించారు. మాస్కులను ధరించడం కూడా మానలేదు.హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అన్ని ప్రదేశాల్లోనూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించారు.
* లాక్‌డౌన్ లేకపోయినప్పటికీ హాంగ్‌కాంగ్ ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటించారు. దీంతో కరోనా కట్టడి సాధ్యమైంది. అక్కడ ప్రస్తుతం లాక్‌డౌన్ లేకపోయినా.. అన్ని పనులు యథావిధిగానే కొనసాగుతున్నాయి. కరోనా కట్టడిలోనే ఉంది.
ఈ క్రమంలోనే హాంగ్‌కాంగ్ మోడల్‌ను భారత్‌లోనూ అనుసరించాలని చూస్తున్నారు. మరి మోదీ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!