ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద కరోనా మెడిసిన్ కరోనైల్‌ను మంగళవారం విడుదల చేసిన విషయం విదితమే. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పతంజలి యోగపీఠ్‌లో ఈ మెడిసిన్‌ను ఆవిష్కరించారు. అయితే ఈ మెడిసిన్‌ను పతంజలి సంస్థ ప్రజలకు ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. అందుకు గాను సన్నాహాలు చేస్తోంది.
పతంజలి కరోనా మెడిసిన్ కరోనైల్‌ను 30 రోజుల డోసులుగా ఒక కిట్ రూపంలో విక్రయించనున్నారు. దీని ధర రూ.545గా ఉండనుంది. ఇక ఈ మెడిసిన్‌ను పతంజలి సంస్థ ప్రజలకు ఇళ్ల వద్దకే డెలివరీ చేయనుంది. అందుకు వారు ఆన్‌లైన్‌లో మెడిసిన్ కోసం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మెడిసిన్‌ను విక్రయించేందుకు పతంజలి కొత్తగా ఆర్డర్‌మి అనే యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ యాప్‌లో ఆర్డర్ చేసిన కరోనా మెడిసిన్‌ను పతంజలి హోం డెలివరీ చేయనుంది.
అయితే పతంజలి సంస్థ తయారు చేసిన కరోనైల్ ఔషధం రీసెర్చి వివరాలను ఇంకా తమకు సమర్పించలేదని, అందువల్ల ఆ మెడిసిన్ విక్రయాలు, ప్రచారాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది. అయితే దీనికి స్పందించిన పతంజలి.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రీసెర్చి వివరాలను సమర్పిస్తామని తెలిపారు. ఇక బాబా రాందేవ్ స్పందిస్తూ.. కరోనైల్ మెడిసిన్ కేవలం 3 నుంచి 7 రోజుల వ్యవధిలోనే 100 శాతం కరోనాను నయం చేసిందని తమ క్లినికల్ ట్రయల్స్‌లో ఫలితాలు వచ్చాయన్నారు. అవే వివరాలను కేంద్రానికి అందజేస్తామని, త్వరలోనే మెడిసిన్ విక్రయాలను ప్రారంభిస్తామని తెలిపారు.