పార్టీ పెట్టిన మొదట్లో “సీనియార్టీ” ముసుగువేసి చంద్రబాబుకు మద్దతు పలికారు పవన్ కల్యాణ్. అదేంటి… “ప్రశ్నిస్తాను” అని పార్టీ పెట్టి… ఇలా ఒకరి పంచన చేరినంత పనిచేయడమేమిటని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. కానీ… ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి రావడంతో.. అందులో పవన్ పాత్ర కూడా చాలా కీలకంగా పనిచేసిందని అంతా అన్నారు. అనంతరం మైత్రి చెడిన తర్వాత.. పవన్ ని “బోడి మల్లన్న” అన్నారనుకోండి అది వేరేవిషయం! ఈ క్రమంలో టీడీపీతో మైత్రి చెడిపోవడం… బీజేపీతో పొత్తుపెట్టుకుని బండి నడుపడం జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాబును అడ్డంగా ఇరికించేశారు!
జగన్ ముఖ్యమంత్రి అయిన అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చేసరికి… బాబుమాట నమ్మి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ధర్నాలకు, దీక్షలకు దిగారు. దీంతో… రాజధానిని అమరావతి నుంచి మార్చితే ఆ నేరం మొత్తం జగన్ ప్రభుత్వంపై వేసెయ్యొచ్చనేది బాబు ప్లాన్! రాజధాని మార్చని పక్షంలో అసలు గొడవేలేదు!! ఈ క్రమంలో… నేడు అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు ప్రధాన కారణం చంద్రబాబు అని కన్ ఫాం చేసేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్!
తాజాగా అమరావతి – మూడు రాజధానుల బిల్లు – సీఆర్డీయే రద్దు బిల్లుల విషయంలో స్పందించారు పవన్. విభజన అనంతరం “ఏపీకి రాజధాని” విషయంలో స్పందించిన మోడీ… గాంధీ నగర్ ని ఉదహరించారని, అనంతరం రెండు మూడు వేల ఎకరాలలో ఒక రాజధానిని నిర్మించుకుంటే సరిపోతుందని నాడు మోడీ చెప్పారని, దానికి నాడు అందరూ సరేనన్నారని తెలిపారు! కానీ… అనంతరం హస్తిన నుంచి ఆంధ్రాకి వచ్చిన తర్వాత బాబు మరిపోయారని తెలిపారు పవన్!
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వారి విధానపరమైన ఆలోచనో లేక మరోరకం ఆలోచనో తెలియదు కానీ.. రైతుల నుంచి అన్ని వేల ఎకరాల భుమిని సేకరించడం మొదటి తప్పని తెలిపారు. అనంతరం అన్ని వేల ఎకరాల భూమితో సింగపూర్ వంటి రాజధాని కట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారని అన్నారు. అసలు సింగపూర్ లాంటి రాజధానిని కట్టాలంటే.. ముందుగా “లీ క్యూన్ వ్యూ” వంటి ఉన్నతమైన మనసు, భావాలు ఉండాలని.. అలాంటి రాజకీయాలు మనకు ఇక్కడ లేవని పవన్ కుండబద్దలు కొట్టారు!
అసలు సింగపూర్ గురించి పూర్తిగా తెలిసిన వారు అలాంటి ఆలోచన చేయరని… ఏదో కాన్సెప్ట్ అమ్మేయాలని చూడటమే తప్ప అన్నేసి వేల ఎకరాల భూములు తీసుకోవడం వల్ల ఒరిగేదీ ఉండదని, తాను నాడే చెప్పానన్నట్లుగా పవన్ స్పందించారు. అన్నేసి వేల ఎకరాలు సేకరించినప్పుడు అభివృద్ధి చేయని పక్షంలో… పెను సమస్యలే వస్తాయని, ఇప్పుడువస్తున్నవి అవే అనేది పవన్ ఆలోచనగా ఉంది!!
దీంతో… “అమరావతి” విషయంలో అన్నేసి వేల ఎకరాల భూముల సేకరణ తప్పంటూ బాబును అడ్డంగా ఇరికించేయడం.. ప్రధాని కూడా నాడు 2 – 3 వేల ఎకరాలు మాత్రమే సరిపోతుందని చెప్పడం ద్వారా మోడీని సేవ్ చేయడం.. తో పాటుగా… నేడు రైతులు పడుతున్న ఇబ్బందులకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం అని పవన్ చెప్పినట్లైంది! దీంతో… నేడు జగన్ పై పడుతున్న “టీడీపీ నేతలకు ఊహించని ఇరకాటం” అనడంలో సందేహం ఉండనక్కరలేదు!! దీంతో… పరోక్షంగా జగన్ కి “లైన్ క్లియర్” చేసినట్లయ్యిందని.. ఆ విషయం పవన్ చెప్పకనే చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!