పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? అంటూ పవన్ ప్రశ్నించారు. చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించలేరా? అని నిలదీశారు. రైతుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చే తీరు సరికాదని పవన్ అన్నారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్.సి.ఎస్. చక్కెర కర్మాగారం దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని…రైతుల విషయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని పవన్ ఆరోపించారు. గత రెండేళ్ల నుంచి ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకాయిలను ఇప్పించేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులు చివరకు రోడ్డెక్కి తమ బాధను అందరికీ తెలిసేలా నిరసన చేపట్టారని…ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించకుండా అరెస్టులకు దిగి రైతుల్లో ఆగ్రహాన్ని పెంచారని పవన్ వ్యాఖ్యానించారు.
పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే…మరో వైపు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించాల్సిన ప్రభుత్వం….జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామనడం రైతులను వంచించడమే అంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఈ సమస్యపై రైతుల పక్షాన నిలబడాలని మా పార్టీ నాయకులకు ఇప్పటికే స్పష్టం చేశామని…రాష్ట్రవ్యాప్తంగా చెరకు రైతులకు రూ.90 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు వచ్చేలా సమన్వయం చేయాలని….రాష్ట్ర షుగర్ కేన్ విభాగం ఏం చేస్తోంది? అని పవన్ ప్రశ్నించారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే అవకాశం ఉన్నా ఆ చట్టాన్ని వినియోగించకపోవడంపై సందేహాలు వస్తున్నాయంటూ ఆగ్రహానికి గురయ్యారు.